ముంబైలో మాల్ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ, అనన్య

  • ఓ మాల్ లోలైగర్ సినిమా ప్రచార కార్యక్రమం  
  • భారీగా వచ్చిన అభిమానులతో కిక్కిరిసిన వేదిక
  • తోసుకోవద్దంటూ అభిమానులకు విజయ్ అభ్యర్థన
  • అయినా పరిస్థితి సర్దుకోకపోవడంతో నిలిచిపోయిన కార్యక్రమం
‘లైగర్’ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే సినిమా ప్రచార కార్యక్రమాలతో ఇంకా బిజీగానే ఉన్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ జంట ఆదివారం ముంబైలోని ఓ మాల్ కు వెళ్లింది. వీరిని చూసి భారీగా అభిమానులు మాల్ లోని ప్రచార వేదిక వద్దకు దూసుకువచ్చారు. దీంతో ప్రశాంతంగా ఉండాలని, తోసుకోవద్దంటూ వారిని విజయ్ కోరాడు. తొక్కిసలాట చోటు చేసుకోకుండా చూడాలని అభ్యర్థించాడు. 

అయితే, విజయ్ కోరిన తర్వాత కూడా అభిమానుల సందడి తగ్గలేదు. దీంతో ఏదైనా అపశ్రుతి జరగొచ్చన్న సందేహంతో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రచార కార్యక్రమాన్ని అర్థాంతరంగా ఆపేసి మాల్ నుంచి వెళ్లిపోయారు. 

‘‘మీ ప్రేమ నా హృదయాన్ని టచ్ చేసింది. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను. మీ అందరితో చాలా కాలం పాటు కలసి ఉండాలని అనుకుంటున్నాను. మీ అందరి గురించే ఆలోచిస్తూ బెడ్ మీదకు వెళుతున్నాను. గుడ్ నైట్ ముంబై, లైగర్’’ అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కాంక్షించే కార్యక్రమం మధ్యలో ఆపేయాల్సి వచ్చినట్టు సినిమా సహ నిర్మాత చార్మి కౌర్ సైతం ట్వీట్ చేశారు.


More Telugu News