ఆ సినిమా ఫ్లాప్ అనే సంగతి నాకు ముందే తెలుసు: చందూ మొండేటి

  • 'కార్తికేయ 2' ప్రమోషన్స్ లో చందూ మొండేటి 
  • 'సవ్యసాచి' గురించి ప్రస్తావించిన డైరెక్టర్ 
  • కథ విషయంలో కన్ఫ్యూజ్ అయినట్టుగా వెల్లడి 
  • 'కార్తికేయ 2' పై నమ్మకం ఉందంటూ వ్యాఖ్య 
చందూ మొండేటి అనగానే 'కార్తికేయ' సినిమా .. అది సాధించిన సక్సెస్ గుర్తుకొస్తాయి. ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'కార్తికేయ 2' సినిమాను రూపొందించాడు. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 
 
తాజా ఇంటర్వ్యూలో చందూ మొండేటి మాట్లాడుతూ 'సవ్యసాచి' గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ సినిమా కొంతవరకూ షూటింగ్ చేసిన తరువాత కథ విషయంలో తాను కన్ఫ్యూజ్ అయ్యాననీ, అందువల్లనే అది దెబ్బ కొట్టేసిందని చెప్పాడు. కథలో ఎక్కడైనా పొరపాటు జరిగితే అది మిగతా అంశాలను కూడా ప్రభావితం చేస్తుందని అన్నాడు. 

'సవ్యసాచి' సినిమాను చూసుకున్న తరువాత తనకే నచ్చలేదనీ, ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం తనకి ముందుగానే తెలిసిపోయిందని చెప్పాడు. పెద్ద బ్యానర్ తనకి అవకాశం ఇచ్చినప్పటికీ తాను ఉపయోగించుకోలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందని చెప్పుకొచ్చాడు. 'కార్తికేయ 2'తో ఆయన మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.


More Telugu News