మంచానికి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఐఐటీ విద్యార్థి... ఘ‌ట‌న‌పై అనుమానం వ్య‌క్తం చేసిన తండ్రి

  • ఏపీలోని నంద్యాల‌కు చెందిన రాహుల్‌
  • కంది ఐఐటీలో ఎంటెక్ సెకండియ‌ర్ చ‌దువుతున్న వైనం
  • త‌ల్లిదండ్రులు రాక‌ముందే మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించిన అధికారులు
  • మంచానికి ఉరేసుకుని ఎవ‌రైనా చ‌నిపోతారా? అంటూ ప్ర‌శ్నిస్తున్న తండ్రి
హైద‌రాబాద్ శివారులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)లో ఎంటెక్ విద్య‌న‌భ్య‌సిస్తున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైనం క‌ల‌క‌లం రేపుతోంది. సంగారెడ్డి స‌మీపంలోని కందిలో ఐఐటీ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ విద్యా సంస్థ‌లో ఏపీలోని నంద్యాల‌కు చెందిన రాహుల్‌ ఎంటెక్ సెకండియ‌ర్ చ‌దువుతున్నాడు. బుధ‌వారం తెల్లారేస‌రికి తాను ఉంటున్న హాస్ట‌ల్ గ‌దిలో మంచానికి ఉరేసుకుని... కింద ప‌డుకున్న స్థితిలో అత‌డు చ‌నిపోయి క‌నిపించాడు. ఈ ఘ‌టన తెలిసినే వెంట‌నే విద్యాల‌యం అధికారులు మృతుడి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండానే... అత‌డి మృత‌దేహాన్ని సంగారెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు.

చాలా ఆల‌స్యంగా కుమారుడి మ‌ర‌ణ వార్త తెలుసుకున్న రాహుల్ త‌ల్లిదండ్రులు ఉరుకులు ప‌రుగుల మీద విద్యాల‌యం చేరుకున్నారు. అప్ప‌టికే రాహుల్ మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి కావ‌డం, అత‌డి మృత‌దేహాన్ని త‌మ‌కు చూపించేందుకు విద్యాల‌యం అధికారులు నిరాక‌రిస్తున్న వైనంపై రాహుల్ తండ్రి అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రైనా మంచానికి ఉరేసుకుని చ‌నిపోతారా? అంటూ ఆయ‌న అడుగుతున్న ప్ర‌శ్న‌కు అధికారుల నుంచి స‌మాధానం రాలేదు. అయినా త‌న కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే అత‌డి మృత దేహాన్ని త‌మ‌కు ఎందుకు చూపించ‌డం లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.


More Telugu News