నీరా రాడియాకు క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ

  • 2009లో కేబినెట్ కూర్పులో రాడియా పాత్ర‌పై వివాదం
  • నీరా రాడియాపై కేసు న‌మోదు చేసిన సీబీఐ
  • మొత్తం 14 కేసుల్లో పూర్తయిన సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ‌
  • ఏ ఒక్క కేసులో రాడియా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ‌ట్లుగా ఆధారాలు ల‌భించ‌లేద‌న్న సీబీఐ
  • విచార‌ణ‌ను వ‌చ్చే వారానికి వాయిదా వేసిని సుప్రీంకోర్టు
కార్పొరేట్ సంస్థ‌ల మ‌ధ్య‌ మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెర‌ప‌డ‌మే వృత్తిగా సాగిన నీరా రాడియా టేపుల వ్య‌వ‌హారంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో బుధ‌వారం విచార‌ణ జ‌రిగింది. 2009లో కేంద్ర కేబినెట్‌లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపున‌కు సంబంధించి నీరా రాడియా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా సీబీఐ సుప్రీంకోర్టులో ఓ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ప‌రిగ‌ణిస్తున్న నీరా రాడియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. 

ఈ వ్య‌వ‌హారంలో న‌మోదు చేసిన 14 కేసులలో ఇప్ప‌టికే ప్రాథ‌మిక విచార‌ణ పూర్తయిందని కోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రాథ‌మిక విచార‌ణ‌లో భాగంగా 14 కేసుల్లో ఏ ఒక్క దానిలోనూ నీరా రాడియా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ‌ట్లుగా ఆధారాలు ల‌భించ‌లేద‌ని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ అఫిడ‌విట్‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు విచార‌ణ‌ను వ‌చ్చే వారానికి వాయిదా వేసింది.


More Telugu News