'జపాన్ సంస్కృతిని మెచ్చుకునేది ఇందుకే..' అంటూ వీడియో పోస్ట్ చేసిన హర్ష్ గోయెంకా
- ఆర్పీజీ గ్రూపు చైర్ పర్సన్ హర్ష్ గోయెంకా ట్వీట్
- జపాన్ వీడియో ఒకటి షేర్
- బాలిక రోడ్డు దాటేందుకు కారుని నిలిపివేసిన డ్రైవర్
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్ పర్సన్ హర్ష్ గోయెంకా జపాన్ కు సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. మరో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మాదిరే హర్ష్ గోయెంకాకు ట్విట్టర్లో ఫాలోవర్లు ఎక్కువ. 17 లక్షల మంది ఆయన్ను ఫాలో అవుతుంటారు.
తాను జపాన్ సంస్కృతిని ఎందుకు మెచ్చుకుంటానో తెలియజేసే ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. ఇదొక జీవిత పాఠమని, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మనం కూడా వీటిని అనుసరించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. జపాన్ లో ఒక రహదారిపై కారు వేగంగా వెళుతోంది. రోడ్డు దాటేందుకు ఓ బాలిక రోడ్డుకు కుడివైపున వేచి చూస్తోంది. కారు డ్రైవర్ ఆ బాలికను గుర్తించిన వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు.
దీంతో ఆ బాలిక వేగంగా రోడ్డు అటువైపుకు దాటేసింది. అనంతరం బాలిక ఆ కారు డ్రైవర్ కు ధన్యవాదాలు చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను ఇప్పటికే 65 లక్షల మంది చూశారు.