జగన్ జనాలకు చుక్కలు చూపిస్తున్నారు.. అనిల్ పత్తా లేకుండా పోయారు: అశోక్ బాబు
- అలవికాని హామీలిచ్చి జగన్ అధికారంలోకి వచ్చారన్న అశోక్ బాబు
- జగన్ సంక్షేమమంతా ప్రకటనలకే పరిమితమయిందని విమర్శ
- సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్ రెడ్డి ఎందుకు తిడుతున్నారని ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలోని సంక్షేమమంతా రంగు కాగితాలకే పరిమితమయిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. 98 శాతం హామీలను అమలు చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి... వాటి వివరాలను ప్రజల ముందు పెట్టే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. రాయలసీమలో ఒక్క రైతుకైనా డ్రిప్ ఇరిగేషన్ కింద ఈ ప్రభుత్వం సాయం చేసినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అధికారం కోసం అలవికాని హామీలను ఇచ్చిన జగన్... సీఎం అయ్యాక ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని అన్నారు.
నవరత్నాలకు పెట్టిన ఖర్చును కూడా పథకాల వారీగా కాకుండా కులాల వారీగా లెక్కలు చెపుతుండటం దారుణమని అశోక్ బాబు అన్నారు. కులాల కార్పొరేషన్ల ద్వారా ఎంత మందికి లబ్ధి చేకూర్చారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019-20లో విత్తనాలు దొరక్క ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం ప్రకటించారని... ఇప్పటి వరకు ఆ పరిహారాన్ని ఇవ్వలేదని చెప్పారు.
రైతు భరోసా కింద ప్రతి రైతుకి రూ. 15 వేలు ఇస్తామన్న జగన్ రెడ్డి రూ. 7,500లతో సరిపెట్టారని అశోక్ బాబు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక పావలా వడ్డీ రుణానికి మంగళం పాడేశారని దుయ్యబట్టారు. ఆక్వా రంగానికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ, డీజిల్ రాయితీని తొలగించారని... మోటార్లకు మీటర్లు బిగించి, రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడానికి కూడా ఈ ముఖ్యమంత్రి వెనుకాడటం లేదని అన్నారు. జగన్ రెడ్డి చెబుతున్న పథకాల అమలు, సంక్షేమం అంతా ప్రకటనలకే పరిమితమైంది తప్ప, ప్రజలకు కాదని... ఒక చేత్తో రూపాయి ఇస్తూ, మరో చేత్తో 3 రూపాయలు లాక్కుంటున్నాడని ప్రజలకు బాగా అర్థమైందని చెప్పారు.
పోలవరం నిర్మాణంపై గతంలో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు పత్తాలేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పీడీ ఖాతాల్లోని సొమ్మును దారి మళ్లించి పథకాలకు వినియోగించారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, బడ్జెట్ ను కులాలవారీగా విభజించి, సంక్షేమాన్ని కూడా కులాలవారీగా చూపే దుస్థితికి వచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కుళ్లతో ప్రజలంతా సంతోషంగా ఉంటే, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్ రెడ్డి ఎందుకు తిడుతున్నారు? అని ప్రశ్నించారు. ‘గడపగడపకు’ అంటూ ప్రజల ముందుకు వెళ్తున్న వారికి చీపుర్లు, చెప్పులతో కూడిన స్వాగతాలు ఎందుకు లభిస్తున్నాయో” ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.