తెలుగులోను 'కాంతార' సినిమాకి కాసుల వర్షం!

  • కన్నడలో ఘన విజయాన్ని నమోదు చేసిన 'కాంతార'
  • ఈ నెల 15వ తేదీన తెలుగులో రిలీజైన సినిమా 
  • తెలుగు రాష్ట్రాల్లోను భారీ వసూళ్ల నమోదు 
  • దీపావళికి మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్    
ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి కూడా భారీ సినిమాలు వస్తున్నాయి .. సంచలన విజయాన్ని సాధిస్తున్నాయి. అలా వచ్చిన సినిమానే 'కాంతార'. అడవిని ఆధారంగా చేసుకుని జీవించే ఒక గిరిజన గూడెం .. అక్కడి ఆచారంతో ముడిపడిన ఒక విశ్వాసం .. అక్కడే పుట్టిన ఒక ప్రేమకథ .. అడవి బిడ్డలపై కన్నెర్రజేసిన పెద్దరికంపై దైవశక్తి చూపించే ఆగ్రహమే ఈ కథ.

ఈ కథలోని ఆచారం .. సంప్రదాయ గిరిజన నృత్యం ఇక్కడి ప్రేక్షకులకు కొత్తగా అనిపించినా, కథాపరంగా అవి పెద్దగా అడ్డుగా అనిపించవు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తోంది. క్రితం నెల 30వ తేదీన కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇక ఈ నెల 15వ తేదీన తెలుగులో విడుదలైన ఈ సినిమా, తొలి రెండు రోజుల్లోనే 10 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా వసూళ్లు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా రిషబ్ శెట్టిని ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది.


More Telugu News