తనను రాష్ట్రపతిగా నియమించాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ పై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు

  • సుప్రీంకోర్టులో సావంత్ అనే వ్యక్తి పిటిషన్
  • తనను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదని ఆరోపణ
  • దిక్కుమాలిన పిటిషన్ అంటూ కోర్టు ఆగ్రహం
  • వేళాకోళంగా ఉందా అంటూ పిటిషనర్ పై మండిపాటు
ఎంతో కీలకమైన కేసుల విచారణతో బిజీగా ఉండే సుప్రీంకోర్టు ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను భారత రాష్ట్రపతిగా నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కిశోర్ జగన్నాథ్ సావంత్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం పరిశీలించింది. 

పిటిషన్ తీరుతెన్నులపై ఆ ఇద్దరు న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇదొక దిక్కుమాలిన పిటిషన్ అని, సుప్రీంకోర్టు విధివిధానాలను అవహేళన చేసేలా ఈ పిటిషన్ ఉందని వారు పేర్కొన్నారు. ఇలాంటి పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుతో వేళాకోళం ఆడుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. 

సావంత్ పిటిషన్ ను తిరస్కరించడమే కాకుండా, అతడు ఈ అంశంలో మరోసారి పిటిషన్ తో వస్తే అనుమతించవద్దని కోర్టు రిజిస్ట్రార్ కు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అతడు పిటిషన్ లో పేర్కొన్న అసంబద్ధ విషయాలను కూడా రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది. 

పిటిషన్ పై పరిశీలన సందర్భంగా కిశోర్ జగన్నాథ్ సావంత్ సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనను అనుమతించలేదని ఆరోపించారు. 

తనను తాను పర్యావరణవేత్తగా చెప్పుకున్న సావంత్... ప్రపంచ సమస్యల కోసం తాను పాటుపడతానని వెల్లడించారు. పర్యావరణంపై ఉన్న పరిజ్ఞానంతో అతడు ఇలాంటి ప్రసంగాలు ఇంకెన్నో ఇవ్వగలడని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, పిటిషన్లు దాఖలు చేసే పద్ధతి ఇది కాదని హితవు పలికింది.


More Telugu News