బ్రిటన్ మాజీ ప్రధాని ట్రస్ ఫోన్ హ్యాక్ చేయించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

  • డైలీ మెయిల్ వార్తా సంస్థ సంచలన కథనం
  • ట్రస్ విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నప్పుడు ఏడాది పాటు ఆమె ఫోన్ హ్యాక్
  • ప్రధానిగా 45 రోజుల్లోనే వైదొలిగిన ట్రస్
బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ వ్యక్తిగత ఫోన్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హ్యాక్ చేయించాడన్న వార్తలు కలకలం సృష్టించాయి. ట్రస్ బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె దగ్గర పని చేసిన పుతిన్ ఏజెంట్లు ఫోన్ హ్యాక్ చేశారని డైలీ మెయిల్ వార్తా పత్రిక శనివారం సంచలన కథనం ప్రచురించింది. సదరు ఏజెంట్లు ట్రస్ సన్నిహిత మిత్రుడు క్వాసీ క్వార్టెంగ్‌తో చేసిన ప్రైవేట్ సందేశాలతో పాటు అంతర్జాతీయ మిత్రదేశాలతో చర్చల్లో అత్యంత రహస్య వివరాలను తెలుసుకున్నారని పేర్కొన్నది. ఈ సందేశాలలో ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి, ఆయుధాల రవాణాకు సంబంధించిన వివరాలతో సహా వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు ఉన్నాయని తెలిపింది. 

దాదాపు ఒక సంవత్సరం పాటు ట్రస్ ఫోన్ నుంచి ఈ సందేశాలను హ్యాక్ చేశారని డైలీ మెయిల్ తెలిపింది. కాగా, విదేశీ చేతుల్లోకి వెళ్లిన సందేశాలలో జాన్సన్‌పై ట్రస్, క్వార్టెంగ్ చేసిన విమర్శలు ఉన్నాయి. ఇవి బ్లాక్‌మెయిల్ ప్రమాదానికి దారితీసింది అని డైలీ మెయిల్ పేర్కొంది. ప్రధానమంత్రి పదవి చేపట్టే క్రమంలో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ప్రచార సమయంలో ఈ హ్యాకింగ్ విషయాన్ని కనుగొన్నారని నివేదించింది. కాగా, బ్రిటన్ ప్రధాని అయిన 45 రోజుల్లో లిజ్ ట్రస్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. బ్రిటన్ నూతన ప్రధానిగా గత వారం రిషి సునాక్ ఎన్నికయ్యారు.


More Telugu News