వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు: చంద్రబాబు

  • అయ్యన్న అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు
  • వివేకా కేసును ప్రస్తావిస్తూ జగన్ పై సంచలన ఆరోపణలు
  • సస్పెండ్ అయిన సీఐ శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చిందెవరని ప్రశ్న
  • వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు గురువారం సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసిన వ్యవహారంలో జగన్ సర్కారుతో పాటు సీఐడీ అధికారుల తీరును నిరసిస్తూ గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు... మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. అక్రమ కేసులు పెట్టడంలో జగన్ తో పాటు సీబీఐ అధికారులకు కూడా అవార్డులు ఇవ్వాలంటూ చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.  

వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ సోదరి వైఎస్ షర్మిల సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల ప్రమేయం ఉందని షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొన్నారన్నారు. కడప ఎంపీ సీటు విషయంలో తమ కుటుంబంలో గొడవలు జరిగినట్లుగా కూడా ఆమె తెలిపారన్నారు. సొంత సోదరే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత వివేకా హత్య కేసు నిందితులను కాపాడుతున్నదెవరని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ కేసులో సస్పెండ్ అయిన సీఐ శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చిందెవరని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.

అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న విపక్ష నేతలను జగన్ సర్కారు అరెస్ట్ చేయిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. నేతలపై తప్పుడు ఆరోపణల కింద కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలా తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టాల్సి వస్తే...తాము లక్షల మందిపై పెట్టేవారమని ఆయన అన్నారు. టీడీపీ నేతలను శారీరకంగా హింసించగలరేమో గానీ...తామంతా మానసికంగా చాలా దృఢంగా ఉన్నామన్నారు. తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్న వైసీపీ సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైసీపీ అవినీతి బయటకు వస్తుందన్న భయంతోనే అయ్యన్నను అరెస్ట్ చేశారన్నారు.


More Telugu News