మరణించిన తండ్రి బతికొస్తాడని... మగబిడ్డను బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన యువతి

  • ఢిల్లీలో తండ్రితో కలిసి నివసిస్తున్న శ్వేత 
  • అనారోగ్యంతో తండ్రి మృతి
  • పసిబిడ్డను బలిస్తే బతికొస్తాడన్న తాంత్రికుడు
  • మగబిడ్డను కిడ్నాప్ చేసిన యువతి
మూఢ నమ్మకాల కారణంగా ఓ యువతి విచక్షణ కోల్పోయి పసిబిడ్డను బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన ఉదంతం ఢిల్లీలో చోటుచేసుకుంది. శ్వేత (25) అనే యువతి ఇటీవలే తండ్రిని కోల్పోయింది. శ్వేత తండ్రి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. తాంత్రిక శక్తులపై నమ్మకం ఉన్న శ్వేత... చనిపోయిన తన తండ్రిని బతికించుకునేందుకు ఓ క్షుద్ర పూజారిని ఆశ్రయించింది. అతడు చెప్పిన సలహాతో ఓ మగశిశువును బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి వెళ్లిన శ్వేత... అక్కడ ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకుని ఆమె కుటుంబంతో పరిచయం పెంచుకుంది. తనను వారు నమ్మారని నిర్ధారించుకున్నాక తన ప్లాన్ ను అమలులో పెట్టింది. పిల్లవాడిని మళ్లీ తీసుకువస్తానంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఆ శిశువు తల్లి తన మేనకోడలు రీతూను కూడా శ్వేతతో పంపించింది. 

మార్గమధ్యంలో రీతూకు శ్వేత ఓ కూల్ డ్రింక్ ఇవ్వగా, అది తాగిన రీతూ స్పృహ కోల్పోయింది. అనంతరం మగశిశువుతో శ్వేత కారులో వెళ్లిపోయింది. కాసేపటికి స్పృహలోకి వచ్చిన రీతూ.... జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర గాలింపు చర్యల అనంతరం శ్వేతను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందుకోసం 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజిన పరిశీలించారు. మొబైల్ ట్రేస్ టెక్నాలజీని వినియోగించారు. ఎట్టకేలకు శ్వేతను అరెస్ట్ చేసి శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఈ చిన్నారి క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News