పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవలేదన్న షర్మిల
మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు ఉందన్న కవిత
ఉద్యమంలో పుట్టిన మట్టి కవితను తానని వ్యాఖ్య
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు రావడం విదితమే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ కోవర్టు షర్మిల అని విమర్శించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది.
'తాము వదిలిన “బాణం”... తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”' అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై షర్మిల ఘాటుగా స్పందించారు. 'పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు' అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు.
' అమ్మా.. కమల బాణం... ఇది మా తెలంగాణం... పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం... మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు... నేడు తెలంగాణ రూటు... మీరు కమలం కోవర్టు... ఆరేంజ్ ప్యారేట్టు... మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను... రాజ్యం వచ్చాకే రాలేదు నేను... ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" ను నేను !' అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.