టీవీ లైవ్ లో సర్టిఫికెట్లు చింపేసిన ఆఫ్ఘన్ ప్రొఫెసర్.. ఎందుకంటే!

  • ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలకు యూనివర్శిటీ విద్యను దూరం చేయడంపై వినూత్న నిరసన
  • తన తల్లి, తన చెల్లికి చదువుకునే అవకాశం లేనప్పుడు తనకెందుకీ సర్టిఫికెట్లని ప్రశ్న
  • తాలిబన్ల పాలనను తప్పుబట్టిన కాబూల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నాసిమ్
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలనపై కాబూల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ వినూత్నంగా నిరసన తెలిపారు. కాబూల్ లో ఓ టీవీ షోలో పాల్గొన్న సదరు ప్రొఫెసర్ లైవ్ లోనే తన సర్టిఫికెట్లను చింపేశారు. దేశంలో యూనివర్శిటీ విద్యను మహిళలకు దూరం చేయడానికి నిరసనగా ఈ పని చేసినట్లు తెలిపారు. తన తల్లికి, తన చెల్లెలికి చదువుకునే అవకాశం లేనప్పుడు తనకు మాత్రం ఈ సర్టిఫికెట్లు దేనికని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాబూల్ వర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న షబ్నమ్ నాసిమ్ గతంలో ఆఫ్ఘన్ ప్రభుత్వంలో పాలసీ అడ్వైజర్ గానూ సేవలందించారు. దేశాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నాక వర్శిటీకే నాసిమ్ పరిమితమయ్యారు. ఇటీవల యూనివర్శిటీలలో మహిళలకు ప్రవేశాన్ని నిషేధిస్తూ తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ మహిళలకు యూనివర్శిటీ విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా తాలిబాన్ పాలకులు వెనక్కి తగ్గడంలేదు. ఈ విషయంపై ఆందోళన చేస్తున్న మహిళలకు మద్దతుగా తన సర్టిఫికెట్లను చింపేసినట్లు ప్రొఫెసర్ షబ్నమ్ నాసిమ్ వెల్లడించారు.


More Telugu News