పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగడు: యువశక్తి సభలో హైపర్ ఆది

  • రణస్థలంలో యువశక్తి సభకు హాజరైన పవన్ కల్యాణ్
  • పవన్ సమక్షంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన హైపర్ ఆది
  • పవన్ కల్యాణ్ ను తిట్టే శాఖ పెట్టుకోవాలని వ్యంగ్యం
  • ఎవరిది నిలకడలేని రాజకీయం అంటూ హైపర్ ఆది ఫైర్
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై గిరిజన స్త్రీలు థింసా నృత్యాన్ని ప్రదర్శించగా, పవన్ కల్యాణ్ ఆసక్తిగా తిలకించారు. ఓ దశలో ఆయన గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యంలో కాలు కదిపారు. 

కాగా, ఈ యువశక్తి సభకు పవన్ కల్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది కూడా హాజరయ్యారు. తనదైనశైలిలో పంచ్ లు వేస్తూ వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ ను కూడా నవ్వించారు. ఏపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ను తిట్టే శాఖ కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఆ శాఖ పెట్టుకుని అదే పనిగా తిట్టుకోండి... శాఖల పరువు తీస్తున్నారు... మీ శాఖల గురించి పది నిమిషాలు చెప్పమంటే మీరు పదో సెకనులోనే దొరికిపోతారు అంటూ విమర్శించారు. 

"వారాహి బండిని అడ్డుకుంటారా? ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు... అప్పుడు మీరు కాశీయాత్రకు పోవాల్సిందే. పవన్ కల్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడు. ఈ మధ్య ప్యాకేజీ అంటున్నారు... పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడే తప్ప.... ప్యాకేజీకి కాదురా....! 

ఇంకా, దత్తపుత్రుడు అంటున్నారు... మీరు ఏ నోటితో అయితే దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీపుత్రుడు అనిపించుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ ను ఏదో ఒక మాట అనేసి పాప్యులర్ అయిపోవాలనుకునేవాడే! మీ పాప్యులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా మాట్లాడితే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు! 

నిలకడలేని రాజకీయం అంటున్నారు... మీరేమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా? వ్యాపారాలు ఏమీ లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? టేబుల్ పై భారతదేశం బొమ్మ పెట్టుకుని, టేబుల్ కింద చేయిచాచే మీది నిలకడలేని రాజకీయం... అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అమ్మనాబూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం. 

ఒక్కడి నిజాయతీని తట్టుకోలేక 151 మంది భయపడిపోతున్నారు... అదేనా మీ రాజకీయం? పవన్ ది నిలకడలేని రాజకీయం కాదు, నికార్సయిన రాజకీయం. పవన్ పై కుల ముద్ర వేస్తున్నారు... నన్ను కన్న నా తల్లిపై ఒట్టేసి చెబుతున్నా.... పవన్ లాంటి నీతిమంతుడైన రాజకీయనాయకుడ్ని మరొకరిని చూడలేరు" అంటూ హైపర్ ఆది తీవ్రస్వరంతో ప్రసంగించారు.


More Telugu News