ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ చెడ్డది కాదు.. ఎంతో అవసరం అంటున్న న్యూట్రిషనిస్ట్

  • మన శరీరంలోని ఎన్నో ముఖ్యమైన క్రియలకు ఎల్డీఎల్ అవసరం
  • కణాల నిర్మాణానికి, మరమ్మతులకు, మెదడు ఆరోగ్యానికి కావాలి
  • దీర్ఘకాలం పాటు ఎల్డీఎల్ ఆక్సిడేషన్ కు గురైతేనే ప్రమాదకరం
ఎల్డీఎల్ కొలెస్ట్రాల్. దీన్ని మరింత వివరంగా ‘లో డెన్సిటీ లిపోప్రొటీన్’గా చెబుతారు. సాధారణంగా రక్తంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) మంచిది. ఎల్డీఎల్, వీఎల్డీఎల్ కొలెస్ట్రాల్ చెడ్డవిగా చెబుతుంటారు. నిజానికి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మనకు ఎంతో అవసరమని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ అంటున్నారు. మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన క్రియలకు దీని అవసరం ఉందని చెబుతున్నారు. 

కణాల నిర్మాణానికి ఎల్డీఎల్ అవసరం. కణాల మరమ్మతులకు కూడా కావాలి. అంతేకాదు బైల్, హార్మోన్ల ఉత్పత్తికి కూడా ఇది అవసరమే. సాధారణంగా ఎల్డీఎల్, వీఎల్డీఎల్ స్థాయులు రక్తంలో పెరిగిపోయినప్పుడు.. రక్త నాళాల గోడలపై పేరుకుపోయి రక్త ప్రవాహ మార్గం క్రమంగా కుచించుకుపోయి గుండెపోటుకు దారితీస్తుంది. హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అది అధిక మోతాదులో ఉన్న ఎల్డీఎల్ ను బయటకు పంపిస్తుంది. దీంతో మనకు హాని జరగదు. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కు చెడు ముద్ర వేసినప్పటికీ, ఇది మనకు ఎంతో అవసరమని, మోతాదు మించకుండా చూసుకోవాలన్నది భక్తి కపూర్ సూచన.

ఇందుకు అవసరం...
మన శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన ప్రొటీన్ ను చేరవేసే వాహకం ఎల్డీఎల్. మెదడుకు యాంటీ ఆక్సిడెంట్ గా సేవలు అందిస్తుంది. విటమిన్ డీని మన శరీరం ఉత్పత్తి చేసుకోవడానికి కూడా ఇది కావాలి. అలాగే కార్టిసాల్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్, టెస్టోస్టెరోన్ హార్మోన్ల ఉత్పత్తికి ఎల్డీఎల్ అవసరం. 

ఎల్డీఎల్ అన్నది మన శరీర జీవక్రియల్లో ఎన్నింటికో కీలకమైన మూలకం. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. ఎల్డీఎల్ తక్కువగా ఉంటే అది మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. ఎల్డీఎల్ అధికంగా (కావాల్సిన మోతాదులో గరిష్ఠం) ఉన్న వారికి మెదడులో రక్త నాళాలు దెబ్బతినవని, స్ట్రోక్, డిమెన్షియాకు కారణమయ్యే రిస్క్ ను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఎప్పుడు ఎల్డీఎల్ ప్రమాదకరం?
ఆక్సిడైజ్డ్ ఎల్డీఎల్ తోనే ప్రమాదం అని భక్తి కపూర్ వివరిస్తున్నారు. మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన జీవక్రియలకు కీలకమైన ఎల్డీఎల్ ఆక్సిడేషన్ కు గురైనప్పుడే హానికరంగా మారుతుంది చక్కెరతో కూడిన పదార్థాలను దీర్ఘకాలంగా తీసుకుంటున్న వారిలో ఎల్డీఎల్  ఆక్సిడేషన్ కు గురవుతుంది. అలాగే, ఒమెగా 6 లినోలిక్ యాసిడ్ అనేది కూడా ఎల్డీఎల్ ఆక్సిడేషన్ కు కారణమవుతుంది. కనుక ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలను తగ్గించేయాలి. రిఫైన్డ్ వంట నూనెల్లో ఇది ఉంటుంది. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, నెయ్యిలో ఉండదు. ఇలా ఎల్డీఎల్ ఆక్సిడేషన్ కు ఎక్కువ కాలం పాటు గురైనప్పుడు రక్తనాళాల్లో పాచి పేరుకుపోయి ప్రమాదాలకు దారితీస్తుంది. పొగ తాగడం కూడా ఎల్డీఎల్ ఆక్సిడేషన్ కు కారణమవుతుంది. ఒకవేళ ఒమెగా 6 ఉన్న పదార్థాలు తీసుకునే వారు, వాటిల్లో ఒమెగా 3 కూడా ఉండేలా చూసుకుంటే అప్పుడు ఆ హానికారక ప్రభావం తగ్గుతుంది.


More Telugu News