టర్కీ భూకంపం ఘటనలో శిథిలాల కింద ఘనా ఫుట్ బాలర్.. క్షేమంగా బయటికి!

  • టర్కిష్ లీగ్ లో ఆడేందుకు వచ్చిన క్రిస్టియన్ అట్సు
  • నిన్న హటయ్ ప్రావిన్స్ లో శిథిలాల మధ్య చిక్కుకుపోయి అవస్థలు
  • అతడు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించిన టర్కీలో ఘనా హైకమిషనర్
టర్కీ (తుర్కియే) లో సంభవించిన భారీ భూకంపంలో ఘనా క్రీడాకారుడు చిక్కుకున్నాడు. ఫుట్ బాల్ టీమ్ జాతీయ జట్టు ప్లేయర్, మిడ్ ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు శిథిలాల మధ్య కనిపించాడు. అయితే అతడు ప్రాణాలతో ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని టర్కీలో ఘనా హైకమిషనర్ ఈ రోజు వెల్లడించారు. 

31 ఏళ్ల క్రిస్టియన్ అట్సు.. టర్కిష్ లీగ్ లో ‘హటయ్ స్పోర్’టీమ్ లో ఆడుతున్నాడు. భూకంప కేంద్రానికి దగ్గర్లోనే హటయ్ ప్రావిన్స్ ఉంది. దీంతో ఇక్కడ కూడా భూకంపం తీవ్రత ఎక్కువగానే పడింది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో శిథిలాల మధ్య క్రిస్టియన్ అట్సు చిక్కుకుపోయాడు. అట్సు ఆచూకీని కనిపెట్టిన అధికారులు.. అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి క్షేమ సమాచారం తెలిసింది. 

‘‘నాకో గుడ్ న్యూస్ తెలిసింది. హటయ్ లో క్రిస్టియన్ అట్సు ఉన్నట్లు ఘనా అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి సమాచారం వచ్చింది’’ అని టర్కీలో ఘనా హైకమిషనర్ ఫ్రాన్సిస్కా అషీటే ఒడుంటన్ చెప్పారు. అతడు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అయితే అట్సు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాలేవీ వెల్లడించలేదు. గతంలో ‘న్యూకాస్టిల్’ తరఫున ఐదు సీజన్ల పాటు మిడ్ ఫీల్డర్ గా అట్సు ఆడాడు. ప్రస్తుతం టర్కిష్ లీగ్ లో ‘హటయ్ స్పోర్’ టీమ్ లో ఆడుతున్నాడు.


More Telugu News