నకిరేకల్ కు చెందిన నేత నన్ను చెప్పరాని భాషతో దూషించడం బాధించింది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • చెరుకు సుధాకర్ తనయుడికి కోమటిరెడ్డి ఫోన్
  • తీవ్రంగా దూషించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన చెరుకు సుహాస్
  • వీడియో సందేశం విడుదల చేసిన కోమటిరెడ్డి
  • భావోద్వేగాలకు లోనయ్యానని వెల్లడి
  • ప్రజలు మరో విధంగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోమటిరెడ్డి తనకు ఫోన్ చేసి తన తండ్రిని అభ్యంతరకర రీతిలో దూషించారంటూ చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్ నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ వీడియో ద్వారా స్పందించారు. 

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నకిరేకల్ కు చెందిన ఓ నేత తనను చెప్పలేని భాషతో దూషిస్తున్నాడని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆ నేత ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని, ఈ దూషణల పర్వం గత మూడు నెలల నుంచి కొనసాగుతోందని అన్నారు. 

సందర్భం వచ్చినప్పుడల్లా తనను తిడుతున్నాడని, అనరాని మాటలతో ఎందుకు తిడుతున్నారో తెలుసుకునేందుకే తాను ఫోన్ చేశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే క్యాప్షన్ కాదు... లోపల బైట్ చూడండి అన్నప్పుడు కాస్త భావోద్వేగాలకు గురై మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. తనకు ఎవరినీ తిట్టే అలవాటు లేదని, 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ హద్దులు మీరి ప్రవర్తించింది లేదని వివరణ ఇచ్చారు. 

1987-88లో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినప్పటి నుంచి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసినా అభివృద్ధి కోసమే పాటుపడ్డానని, పేదల కళ్లలో నీళ్లు చూస్తే తన కళ్లలో నీళ్లు వస్తాయని కోమటిరెడ్డి తెలిపారు. కానీ ఇటీవల కాలంలో ప్రతి రోజూ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, అయినా తాను ప్రతిస్పందించలేదని అన్నారు. 

కానీ, నిన్నటి ఆడియో క్లిప్పింగ్ లో నేను ముందు మాట్లాడిన మాటలు కట్ చేసి, దూషించిన బిట్ మాత్రమే చూపిస్తున్నారని ఆరోపించారు. దీన్ని వేరేవిధంగా అర్థం చేసుకోవద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని కోమటిరెడ్డి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. తాను భావోద్వేగాలకు గురై తీవ్రస్థాయిలో మాట్లాడానని వెల్లడించారు.


More Telugu News