భారత్-ఆసీస్ మూడో వన్డే.. మైదానంలోకి దూసుకొచ్చి పరుగులు పెట్టించిన వీధికుక్క.. వీడియో ఇదిగో!

  • ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో ఘటన
  • సెక్యూరిటీ సిబ్బందిని పరుగులు పెట్టించిన శునకం
  • ఆటకు కాసేపు అంతరాయం
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడం సర్వసాధారణ విషయం. కొన్నిసార్లు ప్రేక్షకులు కూడా సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొస్తుంటారు. ఇది కూడా మామూలు విషయమే. భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో వీధి కుక్క ఒకటి మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. దానిని పట్టుకునేందుకు సిబ్బంది పరుగులు తీశారు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది.  ఆ సమయంలో సీన్ అబాట్, ఆస్టన్ ఆగర్ క్రీజులో ఉండగా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ వేసిన మూడో బంతిని అబాట్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని సంధించేందుకు కుల్దీప్ సిద్ధమవుతుండగా ఓ వీధికుక్క మైదానంలోకి చొరబడింది. 

దీంతో దానిని వెళ్లగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది దాని వెనక పరుగులు తీశారు. అది చూసిన శునకం భయపడి మైదానమంతా పరుగులు తీసింది. అది చూసిన టీమిండియా సారథి రోహిత్ శర్మ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రతిగా లక్ష్య ఛేదనలో భారత్ ధీటుగా స్పందిస్తోంది. 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కోహ్లీ 50, హార్దిక్ పాండ్యా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.


More Telugu News