ప్రతీ పట్టణంలోనూ ఇలా చేస్తే బావుంటుంది..: ఆనంద్ మహీంద్రా

  • నవీ ముంబైలో ఓ వంతెన కింద క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ గ్రౌండ్
  • మార్పునకు శ్రీకారం అంటూ ఐడియాని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా
  • వాహనాలకే స్థలాలు చాలడం లేదంటూ ఓ యూజర్ కామెంట్
పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో వినూత్న ఐడియాని తన ఫాలోవర్లతో ట్విట్టర్ లో పంచుకున్నారు. పట్టణాలు, నగరాల్లో క్రీడా మైదానాలకు పెద్ద కొరత నెలకొంది. ఉన్న కొన్ని పెద్ద మైదానాలు ప్రజలు అందరికీ చాలవు. వీధుల్లో ఆడుకునేందుకు పట్టణాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. దీంతో నవీ ముంబైలో కొందరు యువకులు వంతెన కింద ఖాళీగా ఉన్న స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చేశారు. 

ఆనంద్ మహీంద్రాకి ఈ ఐడియా ఎంతగానో నచ్చింది. మార్పునకు శ్రీకారంగా దీన్ని పేర్కొన్నారు. ప్రతి పట్టణంలోనూ ఇలా చేయడంటూ ఆయన ట్విట్టర్ లో సూచన చేశారు. ఇలా చేయడం వల్ల చిన్నారులు, యువతకు క్రీడా స్థలాల కొరత తీరుతుందన్నది నిస్సందేహం. నవీ ముంబైలోని బ్రిడ్జ్ కింద క్రికెట్ గ్రౌండ్, పక్కనే బాస్కెట్ బాల్ కు మార్కింగ్ చేసుకుని, యువత ఆడుతుండడాన్ని వీడియోలో చూడొచ్చు.

ఇదొక మంచి కార్యక్రమమని నేహా చావ్లా అనే యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేటి డిజిటల్ ప్రపంచంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నిశ్చలత్వం సాధారణమై పోయిన తరుణంలో.. ఈ తరహా ప్రయత్నాలు శారరీక చర్యలకు మార్గాన్ని చూపుతాయని పేర్కొన్నారు. వాహనాలు నిలపడానికే స్థలం చాలని పరిస్థితుల్లో ఇలాంటి క్రీడా సదుపాయాలు కల్పించడం కష్టమేనని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.


More Telugu News