రెండేళ్లలో అతడు భారత్ తురుపు ముక్క అవుతాడు: హార్థిక్ పాండ్యా

  • టీమిండియాకు సాయి సుదర్శన్ గొప్ప సేవలు అందిస్తాడన్న పాండ్యా
  • అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడంటూ ప్రశంసలు
  • ఢిల్లీపై పోరులో 62 పరుగులతో అజేయంగా నిలిచిన సాయి  
తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ ఐపీఎల్ 2023లో గుజరాత్ జట్టు తరఫున ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. కేవలం రూ.20 లక్షల బేస్ ధరకు ఈ ఆటగాడిని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఢిల్లీతో మంగళవారం నాటి మ్యాచ్ లో గుజరాత్ విజయానికి అతడు దోహదపడ్డాడు. 

ఐపీఎల్ లో రూ.16, రూ.18 కోట్లు పెట్టి మరీ ఆటగాళ్లను చాలా జట్లు తీసుకున్నాయి. నిజానికి అంత ఖరీదు పలికిన ఆటగాళ్ల పనితీరు కంటే సాయి సుదర్శన్ వంటి తక్కువ ధర పలికిన ఆటగాళ్లే చక్కని ప్రతిభ చాటుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా గుజరాత్ జట్టు కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకను రూ.50 లక్షల బేస్ ధరకు తీసుకుంది. మంచి ఆటగాళ్లను చౌక ధరలకు తెచ్చుకోవడం ఒక్క గుజరాత్ జట్టుకే సొంతం అని చెప్పుకోవచ్చు.

ఓపెనర్లు ఇద్దరూ విఫలమైన వేళ ఢిల్లీతో మ్యాచ్ లో సాయి సుదర్శన్ మూడో స్థానంలో వచ్చి 62 పరుగులతో నాట్ అవుట్ గా నిలవడం ద్వారా సీనియర్లకు తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. దీంతో సాయి సుదర్శన్ ఆటతీరుపై కెప్టెన్ హార్థిక్ పాండ్యా స్పందించాడు. 

‘‘అతడు (సాయి) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఘనత అంతా సపోర్ట్ సిబ్బంది, అతడికే వెళుతుంది. గత 15 రోజుల్లో అతడు చేసిన బ్యాటింగ్, శ్రమ ఫలితాలను మీరు చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఫ్రాంచైజీ క్రికెట్ కు అతడు గొప్ప సేవలు అందిస్తాడు. అంతిమంగా టీమిండియాకు కూడా’’ అని పాండ్యా పేర్కొన్నాడు.


More Telugu News