పార్టీకి విధేయంగా ఉన్నా.. అంతా హైకమాండ్ చూసుకుంటుంది: డీకే శివకుమార్

  • వచ్చే నెల కర్ణాటకలో ఎన్నికలు
  • కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం పోటీ
  • సిద్ధరామయ్యతో విభేదాలు లేవన్న డీకే 
వచ్చే ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య పోటీ నెలకొంది. సీఎంను ఎన్నుకునేది పార్టీ అధిష్ఠానం కాదని, పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని సిద్ధరామయ్య చెప్పారు. తనకు కూడా సీఎం కావాలని ఉందని అన్నారు. ఈ క్రమంలో తాజాగా డీకే శివకుమార్ మాట్లాడుతూ, సీఎం ఎవరనే విషయంలో అనవసరమైన చర్చ వద్దని చెప్పారు. పార్టీకోసం కష్టపడి పని చేస్తున్న వారికి, పార్టీ పట్ల విధేయతగా ఉన్నవారికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అన్నారు. 

తాను పార్టీకి అత్యంత విధేయుడినని, ఏ రోజూ పార్టీని మోసం చేయలేదని డీకే చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తాము గెలుస్తామని, సీఎం ఎవరనే విషయాన్ని హైకమాండ్ కు వదిలేస్తామని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి హైకమాండ్ అండ ఉంటుందని, తమ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను నాయకత్వ బాధ్యతలను తీసుకున్నానని, పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డానని తెలిపారు. విశ్రాంతి అనేది కూడా లేకుండానే తాను రాష్ట్ర నలుమూలలకు తిరిగానని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశామని తెలిపారు. 

సిద్ధరామయ్యతో తనకు విభేదాలు లేవని, పార్టీ గెలుపు కోసం ఇద్దరం కలిసే పని చేస్తున్నామని డీకే చెప్పారు. తమ మధ్య విభేదాలను సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో 140 సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం తనకుందని చెప్పారు.


More Telugu News