కనీస మర్యాద తెలియదా... ఇళయరాజాపై భారీ ట్రోలింగ్

  • ఇటీవల తమిళ సీనియర్ నటుడు మనోబాల కన్నుమూత
  • సంతాపం సందేశాన్ని వీడియో రూపంలో వెలువరించిన ఇళయరాజా
  • తనకోసం మనోబాల పడిగాపులు కాసేవాడన్న మ్యాస్ట్రో
  • సంస్కారం లేని వ్యక్తి అంటూ ఇళయరాజాపై నెటిజన్ల ఫైర్
ఇటీవల తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోబాల కన్నుమూయడం తెలిసిందే. ఆయన మరణంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే, ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా విడుదల చేసిన సంతాప సందేశం చాలామందిని ఆగ్రహానికి గురిచేసింది. 

ఏ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో ఇళయరాజాకు తెలియదా? ఇదేనా ఆయన మర్యాద? అంటూ భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. 

ఇంతకీ ఇళయరాజా తన సందేశంలో ఏమని పేర్కొన్నారంటే... మనోబాల మరణవార్త తనను తీవ్ర విచారానికి గురిచేసిందని తెలిపారు. దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరకముందు మనోబాల ఓ సినీ పాత్రికేయుడిగా కెరీర్ ఆరంభించిన రోజులను ఇళయరాజా గుర్తుచేసుకున్నారు. 

అంతేకాదు, చెన్నైలోని కోడంబాక్కం బ్రిడ్జి వద్ద తన కారు వెళుతుంటే పడిగాపులు కాసే దర్శకుల్లో మనోబాల కూడా ఒకడని ఇళయరాజా పేర్కొన్నారు. అయితే, మనోబాల మరణ వేళ ఇలాంటి విషయం ఎవరైనా వెల్లడిస్తారా అని నెటిజన్లు ఇళయరాజాపై మండిపడుతున్నారు. కనీస సంస్కారం లేకుండా వ్యాఖ్యానించారని విమర్శిస్తున్నారు. 

ఇళయరాజా సంగీతంలోనే మ్యాస్ట్రో అని, సభ్యత విషయంలో మాత్రం కాదని, ఇళయరాజాకు ఇగో ఎక్కువ అని, స్వార్థపరుడు అని నెటిజన్లు ఏకిపడేస్తున్నారు. ఎప్పుడేం మాట్లాడాలో తెలియని వ్యక్తి మన మ్యాస్ట్రో ఇళయరాజా అని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.


More Telugu News