ఇదీ పాన్ ఇండియా సినిమా అంటే.. ‘ది కేరళ స్టోరీ’పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

  • ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది కేరళ స్టోరీ’
  • ఒకవైపు ప్రశంసలు, మరోవైపు నిషేధించాలన్న డిమాండ్లు
  • అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోందని వర్మ ట్వీట్
ఎన్నో వివాదాలు, అడ్డంకుల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ది కేరళ స్టోరీ’. మే 5న విడుదలైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనలు నిలిపేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక షోలు వేస్తున్నారు. 

ఈ సినిమాపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. నిషేధించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. “తమిళ్/మలయాళీ అమ్మాయి హీరోయిన్.. గుజరాతీ నిర్మాత.. బెంగాలీ డైరెక్టర్.. ఓ హిందీ సినిమా.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే’’ అని ట్వీట్ చేశారు.

డైరెక్టర్ సుదీప్తోసేన్ తెరకెక్కించిన ‘ది కేరళ స్టోరీ’లో ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా వివాదాలతోపాటు కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది. తొలిరోజు రూ.8.02 కోట్లు.. రెండో రోజు రూ.11.22 కోట్లు రాబట్టింది. ఆదివారం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసింది.


More Telugu News