ఫాక్స్​కాన్​ తెలంగాణకు ఐకాన్​: కేటీఆర్‌

  • కొంగరకాలన్ లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు భూమిపూజ
  • ఒప్పందం కుదిరిన రెండు నెలల్లోనే శంకుస్థాపన చేశామన్న కేటీఆర్
  • ఇది తెలంగాణకు చిరకాలం గుర్తిండిపోయే రోజు అని వ్యాఖ్య
ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌ పవర్‌హౌస్‌గా తెలంగాణను మార్చుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తైవాన్ కు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు కంపెనీ సీఈవో యాంగ్‌లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. 

అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుకు ఫాక్స్‌కాన్‌ కంపెనీ తెలంగాణను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. 

రెండు నెల్లలోనే అన్ని అనుమతులు ఇచ్చిన అధికారులను మంత్రి అభినందించారు. ఫాక్స్‌కాన్‌ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా ప్లాంటు పూర్తికావాలని కోరుకుంటున్నామని అన్నారు. కంపెనీ ఏర్పాటుతో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఫాక్స్‌కాన్‌ తెలంగాణకు ఐకాన్‌గా నిలువనుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 23 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు.


More Telugu News