పోలీసుల అదుపులో భూమా అఖిలప్రియ.. ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలింపు

  • లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల భారీ ఏర్పాట్లు
  • ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు
  • అఖిలప్రియ వర్గీయుడి దాడితో సుబ్బారెడ్డి ముక్కు నుంచి రక్తం
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను నంద్యాలకు తరలించారు. అఖిలప్రియ అరెస్టుతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్న నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అటు అఖిలప్రియ, ఇటు ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు కొత్తపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.  

అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత అది మరింత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడిచేయడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. ఇది ఉద్రిక్తతకు కారణమైంది. తక్షణం స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసులోనే అఖిలప్రియను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.


More Telugu News