మౌలానా అర్షద్ మదానీ వ్యాఖ్యలకు కౌంటర్ గా.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

  • కర్ణాటకలో బజరంగ్ దళ్‌ను నిషేధించాలన్న కాంగ్రెస్‌ను సమర్థించిన మౌలానా అర్షద్ మదానీ
  • 70 ఏళ్ల క్రితమే బజరంగ్‌ దళ్‌ ను నిషేధించి ఉండాలని వ్యాఖ్య
  • మదానీపై మండిపడ్డ కేంద్ర మంత్రి గిరిరాజ్
  • విభజన సమయంలో ముస్లింలను పాక్‌కు పంపించేసి ఉండాల్సిందంటూ ఆగ్రహం
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం ఓ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధింపు యోచనను సమర్థించిన ముస్లిం పండితుడు మౌలానా అర్షద్ మదానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విభజన సమయంలోనే ముస్లింలను పాకిస్థాన్‌‌కు పంపించి ఉండాల్సిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌, పిఎఫ్‌ఐలపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో, బజరంగ్ దళ్‌పై నిషేధం విధించే విషయాన్ని మౌలానా అర్షద్ మదానీ సమర్థించారు. ఈ చర్య 70 ఏళ్ల క్రితమే తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి గిరిరాజ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘‘దేశ విభజన సమయంలోనే ముస్లింలను పాక్‌కు పంపించి ఉంటే మనం ఇప్పుడు ఓవైసీ, మదానీ లాంటి వాళ్లతో డీల్ చేయాల్సి వచ్చేది కాదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గిరిరాజ్ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ‘‘ఇతర బీజేపీ నేతల్లాగే గిరిరాజ్ కూడా ఆర్‌ఎస్ఎస్ భావజాలం నుంచి స్ఫూర్తి పొందారు. ఆర్‌ఎస్ఎస్ ఎప్పుడూ అఖండ భారత్ విధానానికి కట్టుబడి ఉంది. కానీ, ముస్లింలను పాకిస్థాన్‌కు పంపించేయాలంటూ గిరిరాజ్, అంఖడ్ భారత స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడారు’’ అని నితీశ్ వ్యాఖ్యానించారు. బీహార్‌లోని బేగుసరాయ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి గిరిరాజ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News