ఉత్తర కొరియా తొలి అంతరిక్ష ప్రయోగం విఫలం.. సముద్రంలోకి కూలిపోయిన గూఢచార ఉపగ్రహం

  • తెల్లవారుజామున స్పై శాటిలైట్ ను ప్రయోగించిన ఉత్తరకొరియా
  • రెండో దశలో అసాధారణంగా పని చేసిన రాకెట్ ఇంజిన్
  • ఎల్లో సముద్రంలో కుప్పకూలిన ఉపగ్రహం
మిలిటరీ కార్యకలాపాల కోసం ఉత్తరకొరియా చేపట్టిన తొలి గూఢచార ఉపగ్రహ ప్రయోగం విఫలమయింది. ఈరోజు శాటిలైట్ ను ప్రయోగించిన కాసేపటికే అది సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. ఫియాన్ గాన్ ప్రావిన్స్ లో ఉన్న సోమే శాటిలైట్ లాంచింగ్ గ్రౌండ్ నుంచి ఉత్తరకొరియా కాలమానం ప్రకారం ఉదయం 6.27 గంటలకు  దీన్ని ప్రయోగించారు. 

చొల్లిమా-1 అనే రాకెట్ ద్వారా మల్లిగ్యోంగ్-1 అనే స్పై శాటిలైట్ ను ప్రయోగించారు. అయితే, రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది సముద్రంలోకి కూలిపోయింది. రాకెట్ ప్రయాణం తొలిదశ సక్రమంగానే ఉన్నప్పటికీ... రెండో దశలో ఇంజిన్ అసాధారణంగా పని చేయడంతో ఎల్లో సముద్రంలో కుప్పకూలింది. మరోవైపు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు రీ ప్యొంగ్ చోల్ మాట్లాడుతూ... లోపాలను పునఃసమీక్షించుకుంటామని, త్వరలోనే మరో ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని తెలిపినట్టు కొరియా అధికార మీడియా వెల్లడించింది.

అణ్వాయుధ ప్రయోగాలు, ఆయుధాల తయారీలో దూసుకుపోతున్న కొరియాకు ఇదే తొలి అంతరిక్ష ప్రయోగం కావడం గమనార్హం. తొలి ప్రయోగమే విఫలం కావడం ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు నిరాశను కలిగించే విషయమే.



More Telugu News