నీట్ ఫలితాల్లో టాపర్ గా ఏపీ విద్యార్థి... 720కి 720 సాధించిన వరుణ్ చక్రవర్తి

  • 720 మార్కులకు గానూ 720 సాధించిన వరుణ్
  • తమిళనాడు స్టూడెంట్ తో కలిసి ఫస్ట్ ర్యాంక్
  • 715 మార్కులతో తెలంగాణకు చెందిన రఘుకు 15వ ర్యాంక్
వైద్యవిద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి సత్తా చాటాడు. మొత్తం 720 మార్కులకు గానూ 720 మార్కులు సాధించి ఆలిండియా టాపర్ గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన జే.ప్రభంజన్ కూడా 720 మార్కులు సాధించగా.. ఫస్ట్ ర్యాంక్ ఇద్దరూ పంచుకున్నారు. ఓబీసీ కేటగిరీలోనూ వరుణ్ టాపర్ గా నిలిచాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ యూజీ ఫలితాల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల హవా కనిపించింది. తెలంగాణకు చెందిన కె.జి.రఘురామ రెడ్డి 715 మార్కులతో ఆలిండియా 15 వ ర్యాంకు సాధించాడు. టాప్ 20 ర్యాంకులు సాధించిన అమ్మాయిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు నిలవగా.. అబ్బాయిల్లో ఇద్దరికి చోటు దక్కింది.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులలో..
710 మార్కులతో కాని యాసారి ఎస్సీ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించగా.. వై.ఎల్.ప్రవధన్ రెడ్డి 711 మార్కులతో జనరల్ ఈబీసీ కేటగిరీలో ఆలిండియా 25 వ ర్యాంకు సాధించాడు. ఎస్టీ కేటగిరీలో ఎం.జ్యోతిలాల్ (705) టాపర్ కాగా ఆలిండియా లెవల్ లో 119వ ర్యాంక్ సాధించింది. జనరల్ కేటగిరీలో వి.హర్షిల్ సాయి (710 మార్కులు) 39వ ర్యాంక్, కల్వకుంట్ల ప్రణతి రెడ్డి (710 మార్కులు) 45వ ర్యాంక్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 68,578 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాగా అందులో 42,836 మంది అర్హత సాధించారు. తెలంగాణలో నీట్ పరీక్ష రాసిన 72,842 మంది విద్యార్థులలో 42,654 మంది అర్హత సాధించారు. ఎస్టీ కేటగిరీలో తెలంగాణకు చెందిన ఎల్.మధు బాలాజీ 3వ ర్యాంక్ సాధించాడు. జనరల్ కేటగిరీలో జాగృతి బోడెద్దుల 49 వ ర్యాంకు సాధించింది.


More Telugu News