బ్రిజ్ భూష‌ణ్ కేసులో ట్విస్ట్.. మైన‌ర్‌ను వేధించిన‌ట్లు ఆధారాలు లేవని పోలీసుల రిపోర్టు

  • మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు 
    ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ
  • ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన భారత స్టార్ రెజ్లర్లు
  • మైనర్ ఆరోపణలపై విచారణ చేసి కోర్టుకు రిపోర్టు 
    ఇచ్చిన ఢిల్లీ పోలీసులు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై నమోదైన కేసు కొత్త మలుపు తీసుకుంది. మైన‌ర్‌ను లైంగికంగా వేధించిన‌ట్లు బ్రిజ్ భూష‌ణ్‌పై స్టార్ రెజ్ల‌ర్లు ఆరోపిస్తూ.. ఫిర్యాదు చేశారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ ఢిల్లీ పోలీసులు మైన‌ర్‌ను బ్రిజ్ వేధించిన‌ట్లు ఆధారాలు లేవ‌ని త‌మ ఛార్జిషీట్‌లో తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. బ్రిజ్‌పై మైన‌ర్ దాఖ‌లు చేసిన ఎఫ్ఐఆర్‌ను ర‌ద్దు చేయాల‌ని పోలీసులు త‌మ రిపోర్టులో కోరారు.

 మైన‌ర్ కేసు విష‌యంలో పోలీసులు సుమారు 500 పేజీల నివేదిక‌ను పొందుప‌రిచారు. విచార‌ణ‌లో త‌మ‌కు ఎటువంటి ఆధారాలు ల‌భించ‌లేద‌న్నారు. మైన‌ర్ కేసు విష‌యంలో సీఆర్పీసీ సెక్ష‌న్ 173 కింద రిపోర్టును రూపొందించిన‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.. బాధిత మైన‌ర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్న‌ట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, మైన‌ర్ కేసు విషయంలో జులై 4న కోర్టు విచార‌ణ జ‌ర‌గ‌నుంది.


More Telugu News