ప్రపంచమే అతడిని చంపాలనుకుంటోంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

  • యుద్ధంలో వాగ్నర్‌ గ్రూప్‌ తీవ్రంగా దెబ్బతిందన్న జెలెన్‌స్కీ
  • 21,000 మంది వాగ్నర్‌ సైనికులను హతమార్చామని వెల్లడి
  • ప్రస్తుత పరిస్థితి తన కంటే పుతిన్‌కే ఎక్కువ ప్రమాదకరమని వ్యాఖ్య
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మొత్తం ప్రపంచమే చంపాలని అనుకుంటోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తమ దేశంపై యుద్ధం కారణంగా రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. స్పెయిన్‌ ప్రధాని కీవ్‌ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ స్పానిష్‌ పత్రికలతో మాట్లాడారు. 

‘‘ఈ యుద్ధంలో రష్యా ప్రైవేటు సైన్యం భారీగా నష్టపోయింది. మా దళాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్‌ సైనికులను హతమార్చాయి. మరో 80,000 మంది ఆ గ్రూప్‌ సైనికులు గాయపడ్డారు” అని చెప్పుకొచ్చారు. రష్యా సైన్యం ప్రేరేపిత మూకగానే వాగ్నర్‌‌ గ్రూపును తాము చూస్తామని చెప్పారు.

‘మీకు ప్రాణభయం లేదా..?’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుత పరిస్థితి నాకంటే పుతిన్‌కే ఎక్కువ ప్రమాదకరం. రష్యాలో మాత్రమే వారు నన్ను చంపాలని అనుకుంటున్నారు. కానీ పుతిన్‌ను ప్రపంచం మొత్తం చంపాలని కోరుకుంటోంది” అని వివరించాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇటీవల రష్యాపై వాగ్నర్‌‌ గ్రూపు తిరుగుబాటు చేయడం, బెలారస్ మధ్యవర్తిత్వంతో వెనక్కి తగ్గడం తెలిసిందే.


More Telugu News