మోదీని ప్రపంచమే బాస్ గా గుర్తిస్తోంది.. కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని రాలేదు?: బండి సంజయ్

  • ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు మోదీ అన్న బండి సంజయ్
  • మోదీ వస్తే కేసీఆర్ కు కరోనా, జ్వరం వస్తాయని ఎద్దేవా
  • సామాన్య కార్యకర్తనైన తనను ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ చేసిందని వ్యాఖ్య
ఏ మొహం పెట్టుకుని మోదీ తెలంగాణకు వస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించే మొహం పెట్టుకుని వచ్చారని, వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీని, టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేసే మొహం పెట్టుకుని వచ్చారని, యువతకు ఉపాధి కల్పించే మొహం పెట్టుకుని వచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని రాలేదని ప్రశ్నించారు. 

ప్రపంచమే మోదీని బాస్ గా గుర్తిస్తోందని బండి సంజయ్ కొనియాడారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు మోదీ అని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని అంటున్న కేసీఆర్... ఈ సభకు వచ్చి మాట్లాడాల్సిందని అన్నారు. మోదీ వస్తే కేసీఆర్ కు కోవిడ్ వస్తుందని, జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. 

ఒక సామాన్య కార్యకర్తనైన తనను బీజేపీ కార్పొరేటర్ ను చేసిందని, ఎంపీని చేసిందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని చెప్పారు. ఒకప్పుడు మోదీని దగ్గర నుంచి చూస్తే చాలని అనుకున్నానని... ఇప్పుడు ఆయన భుజం మీద చేయి వేసి బండి అని పిలిచే స్థాయికి చేరుకున్నానని అన్నారు. మోదీ భుజం మీద చేయి వేస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో చెప్పలేనని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 



More Telugu News