పూరి, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మోడ్ ఆన్

  • ఇస్మార్ట్ శంకర్ కు మొదలైన సీక్వెల్
  • పూజా కార్యక్రమంలో పాల్గొన్న రామ్, జగన్, చార్మీ
  • నాలుగేళ్ల కిందట భారీ హిట్ కొట్టిన కాంబినేషన్
పోతినేని రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నాలుగేళ్ల కిందట వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ భారీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. రామ్ ను సరికొత్త పాత్రలో చూపించిన జగన్.. వరుస ఫ్లాపుల తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. నిర్మాత కూడా కావడంతో ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్‌’తో ప్యాన్ ఇండియా చిత్రం చేసిన పూరి బోల్తా కొట్టారు. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. విజయ్ తో జనగణమన చిత్రాన్ని ప్రకటించినా అది పట్టాలెక్కలేకపోయింది. దాంతో, జగన్ మళ్లీ రామ్ ను నమ్ముకున్నారు. అతనితో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌ తీస్తున్నట్లు  ప్రకటించారు. దానికి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అని టైటిల్ కూడా పెట్టారు. 

తాజాగా సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తం షాట్ కు సహ నిర్మాత చార్మీ కౌర్ క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘డబుల్ ఎంటర్ టైన్మెంట్, డబుల్ యాక్షన్, డబుల్ మ్యాడ్ నెస్ తో మేం మళ్లీ వచ్చేశాం. డబుల్ ఇస్మార్ట్ మోడ్ ఆన్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సీక్వెల్‌ సినిమాను కూడా పూరీ స్వీయ నిర్మాణంలో చార్మీతో కలిసి రూపొందిస్తున్నారు. సీక్వెల్‌లో రామ్‌కు జోడీగా మీనాక్షీ చౌదరి నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌ పోతినేని బోయపాటి దర్శకత్వంలో నటించిన స్కంధ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది.


More Telugu News