పదేళ్ల అత్యల్ప ర్యాంక్‌కు పడిపోయిన పీవీ సింధు

  • 2017లో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న తెలుగు షట్లర్
  • తాజాగా 17వ ర్యాంక్‌కు దిగజారిన వైనం
  • ఈ ఏడాది ఒక్క టోర్నీ కూడా గెలవని సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఏడాది నుంచి నిరాశ పరుస్తోంది. ఈ ఏడాది ఆమె ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. గాయాల కారణంగా నాలుగైదు నెలలు ఆటకు దూరంగా ఉంది. దాంతో, ఫామ్ కూడా కోల్పోయింది. ప్రతి టోర్నీలో నిరాశ పరచడంతో ఆమె ర్యాంక్ కూడా దిగజారుతూ వస్తోంది. 2017లో  ప్రపంచ రెండో ర్యాంక్‌కు చేరుకున్న తెలుగమ్మాయి ఇప్పుడు ఏకంగా 17వ ర్యాంక్‌కు పడిపోయింది. గత పదేళ్లలో ఆమెకు ఇదే అత్యల్ప ర్యాంక్‌ కావడం విశేషం. 

బీడబ్ల్యూఎఫ్‌ తాజాగా విడుదల చేసిన మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ లో సింధు ఐదు స్థానాలు కోల్పోయి 12 నుంచి 17వ స్థానానికి దిగజారింది. చివరగా 2013 జనవరిలో సింధు 17వ ర్యాంక్‌లో నిలిచింది. మరో సీనియర్‌‌ షట్లర్ సైనా నెహ్వాల్ 31 నుంచి 36 ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్ లో హెచ్‌ ఎస్ ప్రణయ్‌ 9 నుంచి 10వ ర్యాంక్‌కు దిగజారాడు. లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ 12, 20వ ర్యాంకుల్లో మార్పు లేదు. పురుషుల డబుల్స్ లో భారత్‌ నుంచి అత్యధికంగా సాత్విక్ సాయిరాజ్‌, చిరాగ్ షెట్టి ప్రపంచ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.


More Telugu News