పవన్ కల్యాణ్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు: వైవీ సుబ్బారెడ్డి

  • పబ్లిసిటీ కోసం పవన్ మాట్లాడుతున్నారన్న వైవీ సుబ్బారెడ్డి
  • వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని వ్యాఖ్య
  • సెప్టెంబర్ లో విశాఖకు జగన్ వస్తారని వెల్లడి
వాలంటీర్లపై వపన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణాకు కొందరు వాలంటీర్లు సహకరిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని... పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు ఎంతో బాధపడ్డారని చెప్పారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని... పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. సెప్టెంబర్ లో విశాఖకు సీఎం జగన్ రానున్నారని తెలిపారు.


More Telugu News