వివేకా హత్యకు రాజకీయ కారణాలను జగన్ చెల్లి షర్మిల చెప్పారు!: సోమిరెడ్డి

  • జనసేనాని కొంతమంది వాలంటీర్ల గురించి మాత్రమే మాట్లాడారన్న సోమిరెడ్డి 
  • జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు తెలుస్తోందని వ్యాఖ్య
  • బాబు, లోకేశ్, బాలయ్య, పవన్ లను తిట్టేందుకే వెంకటగిరి సభ అని ఆగ్రహం
  • అశోకుడు చెట్లు నాటించెను.. జగన్ చెట్లు నరికించెను అంటూ సెటైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుచేసే కొంతమంది వాలంటీర్ల గురించి మాత్రమే మాట్లాడారని, కానీ ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్లందరి పరువు తీసేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లుగా అర్థమవుతోందన్నారు. అందుకే పవన్ చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేశారన్నారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలని జగన్ సవాల్ విసురుతున్నారని, మరి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి గతంలో దమ్ములేకపోవడం వల్లే పొత్తులు పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. 

తమ పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లను తిట్టడానికే జగన్ వెంకటగిరిలో బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ బహిరంగ సభలో పిల్లలు, మహిళలు, పెద్దలు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయి మరీ ఇష్టారీతిగా మాట్లాడారని ధ్వజమెత్తారు. జగన్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. నాటి గాంధీ నుండి నేటి నరేంద్ర మోదీ వరకు అందరూ ప్రజల్లోనే తిరుగుతున్నారని, కానీ జగన్ మాత్రం ప్రాణభయంతో తిరుగుతున్నారన్నారు.

అశోకుడు చెట్లు నాటించెను.. జగన్ చెట్లు నరికించెను అంటూ ఆయన ఎద్దేవా చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో చెట్లు నరికివేయడాన్ని ఉద్దేశించి సోమిరెడ్డి పైవిధంగా మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరుకుతున్నారని జగన్ కు ముందే తెలుసునని ఆరోపించారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలు ఏమిటి? అనే విషయాలు ఆయన చెల్లి షర్మిల స్వయంగా చెప్పారన్నారు. చంద్రబాబును ముసలోడు అనడంపై స్పందిస్తూ... రాజశేఖరరెడ్డి ఇప్పటి వరకు బతికుంటే ఆయనను కూడా ముసలోడు అని పిలిచేవాడివా? అని నిలదీశారు.


More Telugu News