ఉత్తరాంధ్రను ఆనుకుని అల్పపీడనం బలపడుతోంది: ఐఎండీ తాజా అలర్ట్

  • తాజా వాతావరణ పరిస్థితులపై ఐఎండీ బులెటిన్
  • పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రేపటికి వాయుగుండంగా మారే అవకాశం
  • ఏపీకి మూడ్రోజులు, తెలంగాణకు నాలుగు రోజుల వర్షసూచన
  • రాయలసీమలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని తెలిపింది. 

అటు, రుతుపవన ద్రోణి పశ్చిమ కొన రాగల రెండు మూడు రోజుల్లో ఉత్తర దిశ వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మారిన వాతారణ పరిస్థితుల నేపథ్యంలో ఐఎండీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాలకు తాజా అలర్ట్ జారీ చేసింది. 

ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో నేటి నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. ఇవాళ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. 

కాగా, గడచిన కొన్ని గంటల్లో ఏపీలో గురుగుబిల్లి (మన్యం జిల్లా)లో 10 సెంమీ, రణస్థలం (శ్రీకాకుళం)లో 7 సెంమీ, తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా)లో 7 సెంమీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో గరిష్ఠంగా నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 40 సెంమీ వర్షపాతం నమోదైంది.


More Telugu News