పులివెందులలో చంద్రబాబు వ్యాఖ్యలకు అవినాశ్ రెడ్డి కౌంటర్

  • చంద్రబాబు తాను సింహాన్ని అని చెప్పుకున్నంత మాత్రాన సింహం కాలేరన్న అవినాశ్ రెడ్డి
  • పులివెందులకు వచ్చి జ్ఞానం లేకుండా మాట్లాడారని మండిపాటు
  • చంద్రబాబు మాదిరి సంకుచితంగా జగన్ ఆలోచించలేదని వ్యాఖ్య
పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సింహాన్ని అని పదేపదే చెప్పుకున్నంత మాత్రాన సింహం కాలేరని అన్నారు. ఈ రోజు కడప జిల్లా వేంపల్లిలో అవినాశ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై నిప్పులుచెరిగారు.

‘‘నువ్వు ఎంత సేపు గట్టిగా అరిచి, నేను సింహాన్ని, కొదమ సింహాన్ని అని అరిస్తే అయిపోతావా? సింహం, కొదమ సింహమని ప్రజలు అనుకోవాలి. జనం నిన్ను చూసి కామెడీ అనుకుంటున్నారు. నువ్వు ఓ కమెడియన్ లాంటోడివి” అని చంద్రబాబుపై మండిపడ్డారు.

భయస్తుడు కాబట్టే.. తాను ధైర్యవంతుడిని అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని అవినాశ్ ఎద్దేవా చేశారు. అంత పెద్దమనిషికి ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకపోతే ఎలా? అంటూ తీవ్రంగా విమర్శించారు. కొదమ సింహం అంటూ చెప్పుకుంటుంటూ ఉంటే చూసే పిల్లలకు కూడా నవ్వు వస్తోందని అన్నారు.

‘‘పులివెందులకు వచ్చి జ్ఞానం లేకుండా మాట్లాడారు. అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. చంద్రబాబులా సీఎం జగన్ ఆలోచించి ఉంటే కుప్పం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేసేవారా?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరి సంకుచితంగా జగన్ ఆలోచించలేదని అన్నారు.


More Telugu News