రామ్ చరణ్‌ను కుమారుడిలా భావిస్తా.. అల్లు అర్జున్ బంగారం: సముద్ర ఖని
- చరణ్ తనను బాబాయ్ అనే వారన్న సముద్రఖని
- చరణ్‌కు ఏ కష్టం రాకూడదని ప్రార్థించే వారిలో తానుంటానని వ్యాఖ్య
- అల్లు అర్జున్ బంగారం లాంటి మనసున్న వ్యక్తి అని ప్రశంస
- ఆయన అందరితో ప్రేమగా ఉంటారని వెల్లడి
అటు దర్శకుడిగా.. ఇటు నటుడిగా సూపర్ బిజీగా ఉన్నారు సముద్రఖని. ఇటీవలే డైరెక్టర్‌గా ‘బ్రో’ సినిమాతో మరో హిట్‌ను అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలో చరణ్, తాను స్నేహితులమయ్యామని చెప్పారు. చరణ్‌ను కుమారుడిలా భావిస్తానని అన్నారు. అల్లు అర్జున్ అందరితోనూ ప్రేమగా ఉంటారని చెప్పారు.
‘‘రామ్‌చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటించాను. నన్ను బాబాయ్ అని పిలిచేవాడు. ఆ సమయంలో మేమిద్దరం స్నేహితులమయ్యాం. అతడిని నా సొంత కుమారుడిలా భావిస్తా” అని సముద్రఖని చెప్పారు. చరణ్‌కు ఏ కష్టం రాకూడదని దేవుడిని ప్రార్థించే వారిలో తానూ ఉంటానని అన్నారు. చరణ్–ఉపాసన దంపతులకు క్లీంకార పుట్టినప్పుడు మెసేజ్ పెట్టానని తెలిపారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలోనూ చరణ్‌తో కలిసి నటిస్తున్నానని చెప్పారు.
ఇక అల్లు అర్జున్‌తో కలిసి ‘అల వైకుంఠపురం’ సినిమాలో నటించానని సముద్రఖని చెప్పారు. బన్నీని తాను అన్బు అర్జున్ అని పిలుస్తానని అన్నారు. ‘‘అన్బు అంటే ప్రేమ అని అర్థం. ఆయన అందరితో ప్రేమగా ఉంటారు. షూటింగ్ సమయంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ బంగారం లాంటి మనసున్న వ్యక్తి” అని ప్రశంసలు కురిపించాడు.