వారిని హేళన చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం: పవన్ కల్యాణ్

  • విశాఖ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులతో పవన్ భేటీ
  • వారిలో అపరమితమైన ప్రతిభ దాగి ఉందన్న జనసేనాని
  • ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తే ఉన్నతస్థాయికి వెళ్తారని వ్యాఖ్య
  • జనసేన ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటామన్న పవన్
దివ్యాంగులను హేళన చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విశాఖ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దివ్యాంగులలో అపరిమితమైన ప్రతిభ దాగి ఉంటుందన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వారికి అండగా ఉంటామని, అధికారులే దివ్యాంగుల వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారి ప్రతిభకు తగినట్లు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తే ఉన్నతస్థాయికి వెళ్తారన్నారు. 2016 దివ్యాంగుల చట్టం సక్రమంగా అమలు చేయడంతో పాటు వారిని చులకనగా మాట్లాడినా, అపహాస్యం చేసినా శిక్షపడేలా కొత్త చట్టాలు తీసుకు వస్తామన్నారు.

జనసేన ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులను గుండెల్లో పెట్టి చూసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే దుస్థితిని దూరం చేస్తామన్నారు. దివ్యాంగుల పట్ల సమాజం చిన్నచూపు చూస్తోందని, ప్రభుత్వాలు కూడా వివక్ష చూపిస్తున్నాయన్నారు. అంగవైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికెట్ ఇవ్వరు.. పెన్షన్ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.


More Telugu News