మరి అక్కడ జగన్‌కు ఓటు ఎలా ఉంది?: పయ్యావుల కేశవ్
- ఊరిలో లేరన్న కారణంతో ఓట్లు తొలగించడం సరికాదన్న పయ్యావుల
- సీఎం జగన్ 30 ఏళ్లుగా పులివెందులలో లేరని వ్యాఖ్య
- అయినా పులివెందులలో ఓటు ఎలా ఉందని నిలదీత
- మూకుమ్మడిగా ఓటర్లను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని ఈసీ చెప్పిందని వెల్లడి
ఉరవకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఊరిలో లేరన్న కారణంతో ఓట్లు తొలగించడం సరికాదు. సీఎం జగన్ గత 30 ఏళ్లుగా పులివెందులలో లేరు. అయినా అక్కడ ఓటు ఎలా ఉంది?” అని ప్రశ్నించారు.
గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓట్లను తొలగించే ముందు ముగ్గురు సభ్యుల కమిటీని వేసి, ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి ఎదుటే మరోసారి తనిఖీ నిర్వహించాలి. మూకుమ్మడిగా ఓట్లను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది” అని వివరించారు.
గతంలోనే ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడిన బీఎల్‌వోలు (బూత్ లెవెల్ అధికారులు) సస్పెన్షన్‌కు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఈసీ వేటు వేసిందని చెప్పారు. తన ఫిర్యాదుతో రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పారు.