ఏపీలో ఏ ఒక్క పిల్లాడు బడికెళ్లకున్నా ఐఏఎస్ కు రాజీనామా చేస్తా: ప్రవీణ్ ప్రకాశ్

  • 5-18 ఏళ్ల పిల్లలంతా స్కూల్లోనే ఉండాలన్న ఐఏఎస్ అధికారి
  • ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
  • స్థూల ప్రవేశాల నిష్పత్తిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని ధీమా
ఐదేళ్ల వయసు నుంచి పద్దెనిమిదేళ్ల వయసు మధ్యలో ఉన్న పిల్లలంతా బడిలోనో, ఓపెన్ స్కూలులోనో, కాలేజీలోనో చదువుకుంటూ ఉండాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా వచ్చే నెల 4వ తేదీలోపు స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్) వంద శాతం సాధించాలని అధికారులకు సూచించారు. వాలంటీర్లు, టీచర్లు, లెక్చరర్లు, అధికారులు.. అందరమూ కలిసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వివరించారు.

2005 సెప్టెంబర్ నుంచి 2018 ఆగస్టు మధ్య జన్మించిన పిల్లల్లో ఏ ఒక్కరైనా సెప్టెంబర్ 4 తర్వాత బడి, కాలేజీకి వెళ్లకుండా ఉన్నట్లు నిరూపిస్తే ఐఏఎస్ కు రాజీనామా చేస్తానని ప్రవీణ్ ప్రకాశ్ చెప్పారు. ఇప్పటికే 464 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని పిల్లల్లో వంద శాతం చదువుకుంటున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని అధికారులకు సూచించారు. వందకు వంద శాతం జీఈఆర్ సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రికార్డు సృష్టించాలని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలవాలని ప్రవీణ్ ప్రకాశ్ పిలుపునిచ్చారు.


More Telugu News