రాజస్థాన్ లోని కోటాలో మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య.. కలెక్టర్ కఠిన ఆదేశాలు

  • పరీక్ష రాసిన కొద్ది సేపటికే విషాదం
  • రెండు నెలల పాటు కోచింగ్ ఎగ్జామ్స్ బ్యాన్  
  • ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 24
రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల మిస్టరీ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నీట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు విద్యార్థులు.. ఆదివారం కోచింగ్ పరీక్ష రాసిన కొద్ది సేపటికే ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 24కు పెరిగింది. 

మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల ఆవిష్కార్ శంభాజీ కాస్లే, బీహార్ కు చెందిన ఆదర్శ్ రాజ్ గా వీరిని పోలీసులు గుర్తించారు. నిన్న మధ్యాహ్నం 3.15 గంటలకు కోచింగ్ ఇనిస్టిట్యూట్ ఆరో అంతస్తు నుంచి ఆవిష్కార్ కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. నీట్ కోసం మూడేళ్ల నుంచి అతడు కోటాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆదర్శ్ రాజ్ తాను ఉంటున్న ఫ్లాట్ లో రాత్రి 7 గంటల సమయంలో ఉరి వేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఈ పనికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. కోటాలో రెండు నెలల పాటు ఎలాంటి కోచింగ్ ఎగ్జామ్స్ నిర్వహించరాదని ఆదేశించారు. కోటాలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మనోధైర్యం చెప్పాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడంపై దర్యాప్తునకు సీఎం అశోక్ గెహ్లాట్ ఈ నెల మొదట్లో ఓ కమిటీని నియమించడం గమనార్హం.


More Telugu News