మార్స్ పైకి మిలియన్ మందిని పంపడం సాధ్యమా..?

  • 2050 నాటికి 10 లక్షల మందిని పంపుతామన్న ఎలాన్ మస్క్
  • మార్స్ పై మనుషులను చంపేసే స్థాయిలో రేడియేషన్
  • చంద్రయాన్3 విజయం సాధించడంతో ఇతర గ్రహాలపై ఆసక్తి
చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే నెల మొదటి వారంలో ఇస్రో చేపట్టనున్న ఆదిత్య మిషన్ పైకి మళ్లింది. చంద్రయాన్ సక్సెస్ మరోసారి అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని ప్రేరేపించినట్టే చెప్పుకోవాలి. అసలు భూమికి వెలుపల ఉన్న గ్రహాలపై నివాసానికి ఏవి అనుకూలంగా ఉన్నాయనే చర్చ మొదలైంది. ప్రజ్ఞాన్ పంపుతున్న ఉష్ణోగ్రతల సమాచారం ఆధారంగా చూస్తే చంద్రుడిపై నివాసం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు ప్లస్ 100, మైనస్ 100 వరకు నమోదవుతున్నట్టు తెలిసింది. 

చంద్రుడు కాకుండా.. భూమికి సమీప గ్రహాల్లో ఒకటైన అంగారకుడిపై మరోసారి ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. 2050 నాటికి మార్స్ పైకి మిలియన్ (10 లక్షల మంది) ప్రజలను పంపిస్తామని ప్రకటించారు. కానీ, ఇది ఆచరణలో సాధ్యమవుతుందా..? అంటే కష్టమేనని చెప్పక మానదు. 

దీనిపై నాసా శాస్త్రవేత్త డాక్టర్ మిచెల్లే థల్లర్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఆధారంగా మార్స్ పైకి మనుషులను పంపించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మార్స్ మిషన్ సక్సెస్ అయ్యేందుకు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అవసరమని, ప్రస్తుతానికి ఆది ఆలోచనల్లోనూ అసాధ్యమేనన్నారు. అసలు మార్స్ పైకి వెళ్లాలంటే ముందుగా ఎదురయ్యే అతిపెద్ద సవాలు 3.4 కోట్ల మైళ్ల దూరం ప్రయాణం చేయాలి. దీంతో మనుషులను పంపిస్తే వారు క్షేమంగా వెళ్లి, క్షేమంగా తిరిగి వచ్చేలా చూడడం అతిపెద్ద సవాలు అవుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. 

ప్రస్తుతానికి అయితే నాసా రోవర్ గ్రహం ఉపరితలంలోని వాతావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని, ఆక్సిజన్ గా మారుస్తోంది. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు వినియోగిస్తున్నారు. ఎంతో దూరంలో ఉన్న మార్స్ కు వ్యోమగాములు లేదా మనుషులను క్షేమంగా చేర్చగలిగినా.. అక్కడి రేడియేషన్ వారిని చంపేస్తుందని థల్లర్ అంటున్నారు. రేడియేషన్ నుంచి మనుషులను కాపాడే టెక్నాలజీ అవసరం ఉందన్నారు.


More Telugu News