అలా జరిగితే గొప్ప కెప్టెన్ల జాబితాలో రోహిత్ ఉంటాడు: గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- గెలిచిన ట్రోఫీలను బట్టి అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణిస్తారన్న గవాస్కర్
- ఐసీసీ టోర్నీల్లో జట్టును గెలిపిస్తే రోహిత్ గొప్ప సారథుల జాబితాలోకి వెళ్తాడని వ్యాఖ్య
- టాలెంట్ ఉన్నప్పటికీ.. కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలని వెల్లడి
ఎప్పుడో దశాబ్దం కిందట ఓ ఐసీసీ ట్రోఫీని టీమిండియా గెలిచింది. అవకాశాలు చాలానే వచ్చినా.. ఐసీసీ ట్రోఫీలకు అడుగుదూరంలోనే నిలిచిపోయింది. ఇద్దరు సారథులు మారి.. మూడో కెప్టెన్ వచ్చినా పరిస్థితి మాత్రం మారలేదు. మరో 40 రోజుల్లో వన్డే వరల్డ్‌కప్ రాబోతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలిచినా పెద్దగా పేరు రాదని సునీల్ గవాస్కర్ అన్నారు. ఐసీసీ ట్రోఫీలను ఎన్ని గెలిపించారనే దాని ఆధారంగానే అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణిస్తారని చెప్పారు. ‘‘నువ్వు గెలిచిన ట్రోఫీల సంఖ్య, నువ్వు సాధించిన విజయాల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. ఇప్పుడు జరగబోయే రెండు టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలిపితే రోహిత్ శర్మ గొప్ప సారథుల జాబితాలోకి చేరిపోతాడు. అతడికి ఆ సత్తా ఉందని అనుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు.
జట్టులో అందరూ నాలుగో స్థానం గురించి మాట్లాడుతున్నారని, కానీ అసలైన సమస్య సరైన ఆల్‌రౌండర్లు లేకపోవడమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘‘1983, 1985, 2011 వరల్డ్‌కప్ జట్లను గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. అందులో టాప్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. బ్యాటింగ్ ఆడటంతోపాటు కనీసం ఏడు లేదా ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసే వారు. ఆల్‌రౌండర్లు ఎలాంటి జట్టుకైనా అదనపు ప్రయోజనం” అని వివరించారు. ధోనీ నాయకత్వంలోని జట్టును చూస్తే.. సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు బౌలింగ్ చేయగల సమర్థులని గుర్తుచేశారు. అందుకే ప్రతి జట్టుకు ఆల్‌రౌండర్లు తప్పనిసరిగా ఉండాలని గవాస్కర్ అన్నారు.
జట్టులో ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ.. కొంచెం అదృష్టం కూడా కలిసిరావాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నాకౌట్ స్టేజ్‌లో తీవ్రంగా కష్టపడినా లక్ ఉంటేనే విజయం సొంతమవుతుందని చెప్పారు. గత వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఇలానే టీమిండియా ఓడిపోయిందని గుర్తుచేశారు.