ఒకే కుటుంబానికి రెండు టికెట్లు... గాంధీభనవ్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి?

  • స్క్రూటినీ చేసేందుకు గాంధీ భవన్‌లో సమావేశమైన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ
  • ఒకే కుటుంబానికి రెండు టిక్కెట్లపై ప్రతిపాదన చేయాలన్న ఉత్తమ్
  • ససేమీరా అన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య టిక్కెట్ల విషయమై గాంధీ భవన్‍‌లో వాడివేడి చర్చ జరిగింది. టిక్కెట్లకు సంబంధించి ఇరువురు నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఆశావహుల జాబితాను స్క్రూటినీ చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మంగళవారం గాంధీ భవన్లో సమావేశమైంది. ఈ సమయంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్ల విషయమై వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది.

ఇద్దరికి టిక్కెట్లపై పీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదన చేయాలని ఉత్తమ్ పదేపదే కోరగా, తాను ఎలాంటి ప్రతిపాదన చేయనని రేవంత్ స్పష్టం చేశారని తెలుస్తోంది. అంతా అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే పీసీసీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోవాలని ఉత్తమ్ పట్టుబట్టగా, తనకు ఆదేశాలు ఇవ్వవద్దని రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నుండి వెళ్లిపోయారని అంటున్నారు. వీరిద్దరే కాదు పలువురు నేతల మధ్య వాడిగా, వేడిగా చర్చ సాగినట్లు తెలుస్తోంది.

ఒకే కుటుంబానికి రెండు సీట్ల అంశం వచ్చినప్పుడు మహేశ్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచిందని తెలుస్తోంది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. 

బీసీలకు ఎన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలని సీనియర్ నేత వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. అలాగే, మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారో చెప్పాలని రేణుకా చౌదరి కోరారు. సర్వేలను ఏ ప్రాతిపదికన చేస్తున్నారో చెప్పాలని బలరాం నాయక్ కోరారు. ఒకవేళ సర్వే ఆధారంగానే ఇస్తే ఇదంతా ఎందుకని ప్రశ్నించారని తెలుస్తోంది.


More Telugu News