దేశంలో ప్రతి మూడు రోజులకు ఓ పులి మృత్యువాత

  • గత ఐదేళ్లలో మొత్తం 661 పులుల మృతి
  • వృద్ధాప్యం, వ్యాధులు, పోట్లాటలు, ప్రమాదాలు, వేట కారణం
  • గతేడాది అత్యధికంగా 121 వ్యాఘ్రాల మృత్యువాత
దేశంలో ప్రతి మూడు రోజులకు ఓ పులి మృత్యువాత పడుతున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. వీటిలోనూ గత ఐదేళ్లలో ఎక్కువగా పెద్దపులులు మృతి చెందినట్టు పేర్కొంది. వృద్ధాప్యానికి తోడు వ్యాధులు, పోట్లాటలు, విద్యుదాఘాతం, రోడ్లు, రైలు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నాయని వివరించింది. మళ్లీ వీటిలోనూ కూనలే ఎక్కువగా మరణిస్తున్నట్టు తెలిపింది.

దేశంలో గత ఐదేళ్లలో మొత్తం 661 పులులు మరణించినట్టు కేంద్రం తెలిపింది. వీటిలో సహజ, ఇతర కారణాలతో 516 వ్యాఘ్రాలు మరణించగా, దుండగుల వేటకు 126 పులులు, అసహజంగా మరో 19 పులులు మరణించినట్టు వివరించింది. వేటగాళ్లపై ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. ప్రాజెక్ట్ టైగర్, టైగర్ రేంజ్ కలిగిన రాష్ట్రాలు పులుల సంరక్షణపై అవగాహన పెంచుతున్నాయని, ఇందుకోసం రాష్ట్రాలకు నిధులు ఇస్తామని పేర్కొంది. కాగా, 2022లో అత్యధికంగా 121 పులులు మరణించాయి.


More Telugu News