వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో నష్టపోయాం.,.. మమ్మల్ని కూడా పట్టించుకోండి: విజయ్ దేవరకొండకు అభిషేక్ పిక్చర్స్ విజ్ఞప్తి

  • ఖుషి సినిమా విజయంతో ఆనందంలో విజయ్ దేవరకొండ
  • 100 కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని ప్రకటన
  • వరల్డ్ ఫేమస్ లవర్ తో తాము రూ.8 కోట్లు నష్టపోయామన్న అభిషేక్
ఖుషి సినిమా విజయంతో ఖుషీ ఖుషీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ విశాఖపట్నం సక్సెస్ మీట్ లో 100 కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ స్పందించింది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో తాము నష్టపోయామని, తమను కూడా ఆదుకోవాలని కోరింది. 

"డియర్ విజయ్ దేవరకొండ... వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి మేం రూ.8 కోట్లు నష్టపోయాం. కానీ దీనిపై ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు పెద్ద మనసుతో 100 కుటుంబాలకు రూ.1 కోటి ప్రకటించారు. అదే మంచి మనసుతో మీరు మమ్మల్ని, మా ఎగ్జిబిటర్లను, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం" అంటూ ఎక్స్ లో పోస్టు చేసింది. దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

2020లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రధారిగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం వచ్చింది. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కాథరిన్ ట్రెసా తదితరులు నటించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయింది. బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది.


More Telugu News