సచిన్ ఒక్కడే నన్ను పూర్తిగా చదివేశాడు: స్పిన్ దిగ్గజం మురళీధరన్​

  • ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా  
    వస్తున్న '800' సినిమా
  • ట్రైలర్‌‌ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన సచిన్
  • ముత్తయ్య గురించి ప్రజలు తెలుసుకోవాలన్న భారత దిగ్గజం
శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా '800' అనే సినిమా వస్తోంది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య ఖ్యాతి గడించాడు. అతని వికెట్ల నంబర్‌‌నే టైటిల్ గా పెట్టిన ఈ సినిమాలో మురళీధరన్‌ పాత్రను మధుర్ మిట్టల్ పోషిస్తున్నాడు. ఎం.ఎస్.శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ముంబైలో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. 

ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, లంక బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సచిన్.. మురళీధరన్ జీవితంలో ఏం జరిగింది అనేది ప్రజలు తెలుసుకోవాలన్నాడు. ముత్తయ్య తనకు ఆత్మీయుడని, ఆటలో ఎంతో సాధించినా చాలా సాధారణంగా ఉంటాడన్నాడు.


‘1993 నుంచి ఇద్దరి  మధ్య స్నేహం కొనసాగుతోంది. ముత్తయ్య కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చాను. ఆటలో ఎత్తుపల్లాలు సహజం. కొన్నిసార్లు మన ఆట పట్ల నిరుత్సాహానికి గురవుతాం. కానీ, మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. తన జీవితంలో మురళీధరన్ అదే చేసి చూపించాడు' అని సచిన్ చెప్పాడు. తన బౌలింగ్ లో పరుగులు రాబట్టి లారా, రాహుల్ ద్రావిడ్ విజయవంతం అయినా తన బౌలింగ్ శైలిని సచిన్‌ ఒక్కడే పూర్తిగా చదివేశాడని ముత్తయ్య మురళీధరన్‌ చెప్పాడు. కాగా, శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


More Telugu News