విద్యార్థులు నిరసనల్లో పాల్గొనవద్దని సిద్ధార్థ కాలేజీ సర్క్యులర్... ఎమర్జెన్సీ విధించారా? అంటూ స్పందించిన లోకేశ్

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • విజయవాడలో పలు కాలేజీల విద్యార్థులు నిరసన తెలపాలనుకున్నారన్న లోకేశ్
  • పోలీసులు విద్యార్థులపై జులుం ప్రదర్శించారని వెల్లడి
  • నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని హెచ్చరిక
విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇంటికి పంపించేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో ఎమర్జెన్సీ ఏమైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు. 

"చంద్రబాబు అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలపాలని విజయవాడలోని వివిధ కళాశాలల విద్యార్థులు భావించారు. ఆ విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడం దారుణం. సిద్ధార్థ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్ద ఎత్తున పోలీసులు చొరబడడం ఎమర్జెన్సీని తలపిస్తోంది. తరగతులు సస్పెండ్ చేయించి, కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ ప్రభుత్వ ఆదేశాలే కారణం. సైకో పాలకులారా... నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతమవుతుందని గుర్తుంచుకోండి" అని లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. 

అంతేకాదు, సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి విద్యార్థులకు సెలవు ప్రకటించి, వెంటనే ఇంటికి వెళ్లాలని, ఎలాంటి రాస్తారోకోలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, అల్లర్లలో పాల్గొనరాదంటూ జారీ చేసిన సర్క్యులర్ ను కూడా పంచుకున్నారు.


More Telugu News