కెనడాతో దౌత్యవివాదంపై భారత ఆర్మీ స్పందన

  • ఈ వివాదం కారణంగా కెనడాతో రక్షణ రంగ సంబంధాలు తెగిపోవన్న ఆర్మీ ఉన్నతాధికారి
  • రక్షణ రంగంలో కెనడాతో సహకారం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టీకరణ
  • చైనాతో వివాదం నెలకొన్న సమయాంలోనూ ఇదే జరిగిందని వెల్లడి
భారత్-కెనడా వివాదం ఇరు దేశాల రక్షణ రంగం సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపదని ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ జనరల్ అభినయ రాయ్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఇండో పసిఫిక్ ఆర్మీ చీఫ్‌ల సమావేశంలో (ఐపీఏసీసీ) కెనడా పాల్గొంటుందని ఆయన స్పష్టం చేశారు. కెనడా ఆర్మీ డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ ఈ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్నారని వెల్లడించారు. ఐపీఏసీసీపై తాజాగా జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీఏసీసీ లాంటి కీలక సమావేశాలపై ప్రస్తుత దౌత్య వివాదాలు ప్రభావం చూపవని చెప్పారు. ‘‘అది మాపై ఎటువంటి ప్రభావం చూపించదు. కెనడా డిప్యూటీ చీఫ్ తన బృందంతో సహా ఇక్కడకు వస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. చైనాతో వివాదం నెలకొన్న సమయంలోనూ ఇదే జరిగిందని గుర్తు చేశారు. 

మరోవైపు, కెనడాకు చెందిన కల్నల్ టాడ్ బ్రెయిత్‌వెయిట్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యవిభేదాలు రక్షణ రంగ సంబంధాలపై ప్రభావం చూపకూడదని తాను ఆశిస్తున్నట్టు వెల్లడించారు. 

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలసిందే.  నిజ్జర్ హత్య వెనక భారత నిఘా వర్గాల హస్తం ఉండిఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అయితే, భారత్ ఈ ఆరోపణలు అసంబద్ధమంటూ తోసిపుచ్చింది.


More Telugu News